జంపన్న వాగులో ప్రమాదం పొంచి ఉంది. కేవలం హెచ్చరిక బోర్డులు ప్రదర్శనకే పరిమితమయ్యాయి. జంపన్న వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు మునిగి ఇద్దరు భక్తులు మునిగిపోయారు. బుధవారం ఉదయం నాటికి నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. రెడ్డిగూడెం నుంచి నార్లపూర్‌ వైపు వెళ్లే మార్గంలో జంపన్నవాగులో లోలెవల్‌ కాజ్‌వే ఉంది. దీనిపై ఇప్పటికే నడుము లోతుకు పైగా నీటి ప్రవాహం ఉంది.

Advertisement

అయినప్పటికీ భక్తులు ఈ నీటిలోనుంచి నడిచి వెళుతున్నారు. కార్లు, మోటారు సైకిళ్లు సైతం నడిపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నీటి ప్రవాహంలో రెండు మోటారు సైకిళ్లు లోలెవల్‌ కాజ్‌వే పైనుంచి కిందికి నీటిలో కొట్టుకుపోగా గజ ఈతగాళ్లు బయటకు తీశారు. ఓ కారు సైతం నీటి మధ్యలో ఆగిపోవడంతో అందులో ఉన్న భక్తులు ఆందోళనకు గురయ్యారు.

ఈ క్రమంలోనే జంపన్నవాగులో మునిగి ఇద్దరు భక్తులు చనిపోయారు. విషయం తెలిసిన భక్తులు భయాందోళనకు గురవుతుంటే కాజువే నుంచి వెళ్ల వద్దని బోర్డు రాసి ప్రదర్శించారు. నీటిలోనుంచి పోతున్న భక్తులను మాత్రం ఆపేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బుధవారం నుంచి నీటి ప్రవాహం కొద్దిగా పెరగనుంది. పరిస్థితి ఇలాగే ఉంటే భక్తులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా పోలీసులు తగిన చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది.