మహా జాతర ముగింపులో కొత్త ట్విస్ట్‌ ఎదురైంది. ఎప్పటిలాగా జాతర ముగియగానే సమ్మక్క-సారలమ్మను వనప్రవేశం చేస్తారు. అయితే ఈ సారి ఈ తంతు నిర్వహించాల్సిన ఆదివాసీ పూజారులు అలిగి కూర్చున్నారు. దేవతలను తీసుకుపోమంటూ భీష్మించుకుపోయారు.

Advertisement

శనివారం సాయంత్రం అయిదు గంటలకు జరగాల్సిన ఈ కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. దీంతో అధికారులు బుజ్జగింపు చర్యలకు దిగారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేరుగా రంగంలోకి దిగారు. మరోవైపు ఎమ్మెల్యే సీతక్క ఆదివాసీలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం చేశాయి.

మేడారంలో భారీ వర్షం:

మరోవైపు మేడారంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో జాతరకు తరలి వచ్చిన భక్తులు వర్షంలో తడిసి ముద్దయ్యారు. అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక జాతర ముగింపు సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేడారం జాతరను ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. ప్రతి రోజు 15 లక్షల మందిని దేవాలయానికి పంపించడం ఒక ఘనత. జాతర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపారు.