ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి పోటీ ముమ్మరమవుతుంది . ఇప్పటికే ఖాళీగా ఉన్న ఈ పోస్టును మహిళలకు కేటాయించాలంటూ పట్టుదలగా ముందుకు సాగుతుంటే సీనియర్లుగా అవకాశం కల్పించాలంటూ నేతలు తమదైన శైలిలో లాబీయింగ్ నిర్వహిస్తున్నారు . ఇంతకు ముందు మేయర్ గా పనిచేసిన నన్నపనేని నరేందర్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికై తన పదవికి రాజీనామా చేయడంతో కొత్తవారి ఎంపిక అనివార్యమైంది . ఇప్పటికే రాజధానిలో మకాం వేసిన ముఖ్యులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR దృష్టిలో పడేందుకు అవసరమైన యత్నాలు సాగిస్తున్నారు . దీంతో అందరి దృష్టి మేయర్ ఎన్నికపై పడడం విశేషం .
గ్రేటర్ పరిధిలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ కూడా కీలకంగా మారనుండడంతో వారి ఆశీర్వాదం కోసం అవసరమైన వ్యూహ సమాలోచనలు సాగుతున్నాయి . కార్పొరేటర్లు మేయర్ పదవి కోసం పట్టువడుతూనే ఎమ్మెల్యేలను తోడ్పాటు అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు . వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ , పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ , వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ల అభిప్రాయాలు కీలకం కానున్న దశలో లాబీయింగ్ జోరుగా సాగుతుంది . అతి త్వరలోనే పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయం తమకు అనుకూలంగా మలుచుకోవాలని యత్నిస్తున్న సీనియర్ కార్పొరేటర్లు రాజధానిలో మకాం వేశారు
ప్రధానంగా మహిళలకు కేటాయించాలంటూ కార్పొరేటర్లలో గుండు ఆశ్రిత రెడ్డి, నాగమళ్ల ఝాన్సీలు ,యత్నిస్తుండగా తమ సామాజికవర్గాన్ని గుర్తించాలంటూ సీనియర్ సేవలందిస్తున్న కార్పొరేటర్ గుండా ప్రకాష్రావు తనవంతు యత్నాలను ముమ్మరం చేశారు . ఇదే సందర్భంలో అవకాశం ఇస్తే కార్పొరేషన్ను ప్రగతి పథంలో నడిపిస్తామని కార్పొరేటర్లు దాస్యం విజయభాస్కర్ వద్దిరాజు గణేష్లు సైతం పోటీలో ఉండడం ఆసక్తికరంగా మారింది .
అంతేకాకుండా మైనార్టీల కోటాలో ఇప్పటికే ఇంచార్టీ మేయర్ బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ మేయర్ సిరాజుద్దీనే కొనసాగించాలన్న మరో వాదన వినిపిస్తోంది, అయితే కెటిఆర్ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా వరంగల్ మేయర్ స్థానానికి అర్హతగల కార్పొరేటర్ ఎంపిక జరగవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది . ఇప్పటికే ఒక దఫా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో కెటిఆర్ రాజధానిలో సమావేశమై చర్చించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు . ఎవరికీ అవకాశం లభిస్తుందోనన్న ఉత్కంఠత సర్వత్రా నెలకొంది . గ్రేటర్ మేయర్ పీఠంపై అధికారికంగా ఎంపిక చేసేవారి విషయంలో సామాజికవర్గాల సమతూకాన్ని పాటించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించడంతో ఆ దిశలోనే జోరుగా తర్జనభర్జనలు సాగడం విశేషం .