మొబైల్ ఫోన్ చార్జింగ్ పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కొన్ని కొన్ని సార్లు మన నిర్లక్ష్యమే మన ప్రాణాలు తీస్తుంది. ఇటీవల ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకున్న ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. సెల్‌‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మన్నెగూడకు చెందిన గనుకుల నరేశ్ శనివారం రాత్రి ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, నరేశ్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కరంట్ షాక్ వల్లే నరేశ్ మృతి చెందినట్టు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో విద్యుత్ సరఫరాలో నిత్యం హెచ్చతగ్గులు వస్తుంటాయని, నరేశ్ మృతికి అదే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.