యుద్ధం ఇంకా ముగియలేదు

సర్వేలన్నీ తిరిగి తెరాస విజయం సాధిస్తుంది అని తేల్చాయి. ఇందులో అనుమానం ఏమీ లేదు. విజయం ఒక్కటే సరిపోదు. ఆంధ్ర నాయకత్వం లో ఏర్పడిన మహాకూటమికి ఘోర పరాజయం కలిగించడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. తెలంగాణలో ఎన్ని రాజకీయాలు ఉన్నా, సిద్ధాంతాల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా తెలంగాణ నినాదం తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేస్తుంది అని దేశానికి ఈ ఎన్నికల ద్వారా చూపించాలి.

తెలంగాణ ఉద్యమం ఇంకా ముగిసిపోలేదు. యుద్ధం ఇంకా ఆగిపోలేదు. శత్రువులు ఇంకా అవకాశం కోసం పొంచి చూస్తూనే ఉన్నారు. ఆదమరిచినప్పుడు కాటు వేయాలని ఎదురు చూస్తున్నారు. యుద్ధరంగంలోకి తెలంగాణ సైనికులు తిరిగి రాక తప్పనిస్థితి. తెలంగాణ కల సాకారం అయిన తరువాత ఉద్యమ నాయకుడు కేసీఆర్ తో సహా అంతా యుద్ధ అంకం ముగిసిపోయింది. ఇక తెలంగాణ అభివృ ద్ధే మన ముందున్న లక్ష్యం అని అంతా భావించారు. కానీ ఈ ఎన్నికలు కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు పోటీ వంటి పరిణామా లు. కూకట్‌పల్లి నుంచి హరికృష్ణ కుమార్తె పోటీ తెలంగాణ మొత్తం ప్రచా రం చేస్తాను అని బాలకృష్ణ ప్రకటనల పరిణామాలను చూస్తే ఓడిపోయినా శత్రువు అదను కోసం ఎదురు చూస్తున్నాడని, ఓటమి కసితో కాటు వేసేందుకు సిద్ధం అయ్యాడని అర్థమవుతుంది. తెలంగాణ కల సాకారం కాగానే కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి నుంచి తెరాస ఫక్తు రాజకీయ పార్టీనే ఉద్యమపార్టీ కాదని ప్రకటించారు. అప్పటి వరకు ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం. జై తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాల మధ్య ఉద్రిక్తత వాతావరణం. తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ వాతావరణం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది అనే భయం, అనుమానాలు చాలామందిలో ఉండేవి. కానీ చిత్రంగా కేసీఆర్ అలాంటి వాతావరణాన్ని చల్లబరిచారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేశాం సాధించాం. ఇప్పుడు ఎవరిపై ఎవరికీ వ్యతిరేకత అవస రం లేదు. తెలంగాణలో ఉన్న వాళ్లంతా తెలంగాణ బిడ్డలే. అందరం కలిసి అభివృద్ధి సాధించుకొందాం అని పిలుపు ఇచ్చారు. ఆ ప్రభావం తెలంగా ణలో బాగానే కనిపించింది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో లోకేశ్, చంద్రబాబు కాలికి బలపం కట్టుకొని గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసినా తెరాస విజయాన్ని ఆపలేకపోయారు. తెరాస 99 డివిజన్‌లలో విజయం సాధిస్తే, టీడీపీ కేవలం ఒకే ఒక డివిజన్‌కు పరిమితమైంది.

గ్రేటర్ ఎన్నికలతోనే తెలంగాణలో ఆంధ్ర పార్టీల చరిత్ర ముగిసింది. ఫలితాలు వచ్చిన తరువాత తెలంగాణ టీడీపీ టీఆర్‌ఎస్‌లో విలీనమైంది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నాయకులను, టీడీపీ శాసన సభ్యులు, నాయకులను తెరాసలో చేర్చుకోవడం పట్ల తెలంగాణ ఉద్యమకారుల్లో అప్పుడు కొంత అసంతృప్తి వ్యక్తమైంది కూడా.

తెలంగాణవాదులను ఉద్యమ కాలంలో కొట్టిన వారిని చేర్చు కోవలసిన అవసరం ఏముంది? అనే ప్రశ్న తెలంగాణ వాదుల నుంచి వినిపించింది. ఇప్పుడు టీడీపీ, కోదండరాం, కాంగ్రెస్ చేతులు కలుపడం చూస్తుంటే నాటి ఆ నిర్ణయం లోని ముందు చూపు ఎవరికైనా తెలిసొచ్చింది ఉద్యోగంలో ఉన్నా, వివిధ వృత్తుల్లో ఉన్నా, దేశంలో ఉన్నా విదేశాల్లో ఉన్నా తెలంగాణకు చెందిన ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో ఏదో ఓ విధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అది తమ బాధ్యతగా భావించారు. తెలంగాణ ఏర్పడగానే ఒక్కసారిగా ఎవరికీ వారు తమ తమ పనులకు పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే తెలంగాణ యుద్ధం ఇంకా ముగియలేదు . ముగిసింది అనుకుంటే మనం ప్రమాదంలో పడిపోతాం. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా అధికారం కోసమే ప్రయత్నిస్తుంది. తెరాస, కాంగ్రెస్ పార్టీ ఏదై నా తెలంగాణ రాజకీయ నాయకత్వం తెలంగాణలో అధికారం సాధించేందుకు ప్రయత్నిస్తే తప్పు పట్టాల్సిందేమి లేదు. రాజకీయాల్లో అది సహజం. ఏ రాష్ట్రంలోనైనా అలాంటి పోటీ ఉంటుంది. ఉండాలి కూడా. కానీ తెలంగాణలో జరుగుతున్న పోటీ అలాంటిది కాదు. ఆంధ్ర నాయకత్వం దొడ్డిదారిలో తెలంగాణలో అధికారం హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఎన్నికల వ్యయం అమరావతి నుంచి వస్తు న్నదని చెబుతున్నారు. అమరావతిలోనే తెలుగుదేశం జాబితా ఖరారు అయింది. ఢిల్లీలో బాబును ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమా హేమీలైన నాయకులు క్యూ కట్టారు. అప్పటి వరకు ఎప్పు డూ వినిపించని హరికృష్ణ కుమార్తె సుహాసిని తెర పైకి వచ్చారు. ఆమె రాజకీయ ప్రవేశంపై రూపొందించిన పోస్టర్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్టీఆర్, హరికృష్ణ, పరిటాల రవి మొదలుకొని డజను మంది ఒకే సామాజికవర్గానికి చెందిన నాయకుల ఫోటోలు వేశారు. ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేత ఫోటో కూడా లేదు . కనీసం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ ఫోటో కూడా లేదు . సాధారణంగా అభ్యర్థి వెళ్లి పార్టీ అధ్యక్షున్ని కలుస్తారు. కానీ రమణనే ఆమె ఇంటికి వెళ్లి కలిశారు. ఆంధ్ర నాయకత్వం తెలంగాణ నాయకులకు ఇచ్చే విలువ, గౌరవం అది. అమరావతికి వెళ్లే ఆమె తన టికెట్ తెచ్చుకొన్నారు .

ఒక నియోజకవర్గంలో గెలుస్తుందా ? గెలువదా? అనేది కాదు విషయం. తెలంగాణ పై ఆంధ్ర నాయకుల ఆలోచన, తెలంగాణపై మా పెత్తనం ఇంకా చూపిస్తాం అనే వారి అహంరాన్ని గమనించాలి. తెలంగాణలో టీడీపీ ఒక్కచోట గెలిచినా అది తెలంగాణపై పుండు లాంటిదే. అది మనకు అవమానకరమే. రెండు రాష్ర్టాల మధ్య పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. వివాదాలు ఇంకా సమసిపోలేదు. నీళ్ల పంపకాల పై వివాదాలు ఉండనే ఉంటాయి. ఆంధ్ర ప్రయోజనాల కోసం ఆంధ్ర బాబు ప్రయత్నించడం తప్పు కాదు . కానీ తెలంగాణలో కూడా ఆంధ్ర నాయకత్వం కింద పని చేసే నాయకులూ ఉంటే తెలంగాణ బానిసత్వంలో మగ్గిపోవడమే కాదు శాశ్వతంగా నీటి వాటాలకు దూరం అవుతాం. సెక్షన్ 8 ఇంకా మన మెడ పై వేలాడుతూనే ఉన్నది. పదేండ్ల ఉమ్మడి రాజధాని సమస్య అలానే ఉన్నది. శత్రువు విజ యం సాధిస్తే మన ఊపిరి మనమే తీసేసుకున్నట్టు అవుతుంది.
తెలంగాణ ఉద్యమానికి నేనే నాయకత్వం వహించాను అని చెప్పుకొనే కోదండరాం కూడా ఆంధ్ర నాయకత్వానికి జై కొట్టడం ఆశ్చర్యం. కోదండరాంకు కేసీఆర్ పై వ్యక్తిగతంగా కోపం ఉండవచ్చు. అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఇగో దెబ్బతిని ఉండవచ్చు. దానికోసం తెలంగాణ పై మళ్ళీ ఆంధ్ర నాయకత్వం పెత్తనం తీసుకురావడానికి అయన సిద్ధం కావడం సరైన నిర్ణయం కాదు . అధికారం కోసం కాంగ్రెస్ ఏదైనా చేసేందుకు సిద్ధపడుతుంది.

కానీ కోదండరాం కూడా దానికి వంత పాడటం ఎందుకు? సర్వేలన్నీ తిరిగి తెరాస విజయం సాధిస్తుంది అని తేల్చాయి. ఇందులో అనుమానం ఏమీ లేదు. విజయం ఒక్కటే సరిపోదు. ఆంధ్ర నాయకత్వం లో ఏర్పడిన మహాకూటమికి ఘోర పరాజయం కలిగించడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. తెలంగాణలో ఎన్ని రాజకీయాలు ఉన్నా, సిద్ధాంతాల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా తెలంగాణ నినాదం తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేస్తుంది అని దేశానికి ఈ ఎన్నికల ద్వారా చూపించాలి .