ఫ్యాన్స్​తో పాటు ప్రముఖుల జీవితాలపై సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి ఉంటుంది. అయితే సెలబ్రిటీలు మంచి చేస్తే ఎంత వైరల్ అవుతుందో ఏమో గానీ ఏదైనా తప్పు చేసినా, చెడు చేసినా వెంటనే అందరికీ తెలిసిపోతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా వినియోగం కూడా బాగా పెరగడంతో ఏది జరిగినా క్షణాల్లోనే అందరికీ తెలిసిపోతోంది. ఇదిలా ఉండగా కర్ణాటకకు చెందిన ప్రముఖ బీజేపీ ఎమ్మెల్యే రాసలీలల ఫొటోలు బయటికి రావడం సంచలనంగా మారింది. పుత్తూరు బీజేపీ ఎమ్మెల్యే సంజీవ మఠందూర్ ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తున్నాయి.

కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంజీవ ఫొటోల వ్యవహారం బీజీపేకి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ ఘటనలో బాధిత మహిళ తనకు న్యాయం చేయాలంటూ ఉప్పినంగడి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అటు సంజీవ మఠందూరికి ఈసారి ఎలాగైనా టికెట్ రాకూడదని లాబీ కూడా నడుస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటికి రావడం హాట్ టాపిక్​గా మారింది. కాగా, ఈ విషయంలో సంజీవ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.