ఓ యువతి స్నేహితులే కామాంధులై ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది. పందోమ్మిదేళ్ల యువతి జన్మదినోత్సవం జరుపుకొని స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగివస్తుండగా మార్గమధ్యంలో ఆమెపై నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారు. ఔరంగాబాద్ నగరానికి చెందిన ఓ 19 ఏళ్ల యువతి ముంబై నగరంలోని చెంబూర్ ప్రాంతంలో నివాసముంటూ ఉద్యోగం చేస్తోంది. యువతి తన జన్మదినోత్సవాన్ని స్నేహితులతో కలిసి జరుపుకొని ఇంటికి తిరిగివస్తుండగా దారిలో ఆమెపై నలుగురు స్నేహితులు అత్యాచారం చేశారు. అనంతరం ఆ యువతి ఔరంగాబాద్ నగరానికి వెళ్లింది. ఇంటికి వచ్చిన తన కూతురు విలపిస్తుండటం చూసి ఆమెను తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. వైద్యుల తనిఖీల్లో యువతిపై అత్యాచారం జరిగిందని తేలింది. దీంతో తల్లిదండ్రులతో కలిసి యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు ఐపీసీ 376 డి, 34. 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.