తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లటం కన్ఫామ్ అయినట్లు వార్తలు వచ్చాయి. అసదుద్దీన్ ఓవైసీ, కేటీఆర్ తో స్వయంగా చర్చలు జరిపారు ఆమె. ఒకటి, రెండు రోజుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లనున్నట్లు అందరూ అనుకున్నారు. పార్టీ మారి వస్తున్న ఆమెకు మంత్రి పదవితోపాటు.. పార్టీలో పదవి కూడా ఆఫర్ చేశారనేది సమాచారం. అందరూ అయిపోయింది అనుకుంటున్న టైంలో.. సబితా ఇంద్రారెడ్డి వెనక్కి తగ్గారంట.

సబిత ఇంద్రారెడ్డి పార్టీ మారటంపై అలర్ట్ అయిన కాంగ్రెస్ నేతలు ఇప్పటి దశలవారీగా చర్చలు జరిపారు. మారొద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీలో ఆమెతో పాటు కుమారుడికి కూడా సముచిత స్థానం ఉంటుందని హామీలు ఇచ్చారు. స్టేట్ కాంగ్రెస్ నేతల హామీలపై ఏమంతగా నమ్మకంలేని సబితా.. పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర నేతలు.

స్వయంగా రంగంలోకి దిగిన రాహుల్.. సబితతో ఫోన్ లో మాట్లాడారు. ఢిల్లీ రావాలని సూచించారు. పార్టీ దేశ అధ్యక్షుడు సూచనలతో ఆమె, తన కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లి రాహుల్ తో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. వీరితోపాటు రేవంత్ రెడ్డి కూడా వెళుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచనను వాయిదా వేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అన్నట్లు.. రాజకీయాల్లో ఎప్పుడు.. ఏమైనా జరగొచ్చు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సబితా తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు ఆసక్తిగా మారింది.