ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసంలో పండగ నిర్వహణకు అవసరమైన కొనుగోళ్లతో నగరంలోని మండిబజార్‌ కళకళలాడుతోంది. రంజాన్‌ పండగంతా ఇక్కడే కేంద్రీకృతమైనట్లుగా సందడి నెలకొంది. పండగ మరో వారం రోజుల్లో ఉండడంతో వివిధ వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రోజూ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విద్యుత్తు వెలుగులతో జిగేల్‌ మంటోంది. పండగకు కావాలిసిన సరకులు, నూతన వస్త్రాలు, అంకరణ సామగ్రి, సుగంధ ద్రవ్యాలు, అత్తర్లు, ఆభరనాలతో పాటు ఇతరత్రా వస్తువుల కొనుగోలుకు ముస్లిం మహిళలు తరలి వస్తున్నారు. ఈ మాసంలోనే ప్రత్యేకంగా తయారుచేసే హలీమ్‌, హారీస్‌ల సందడి అంతా ఇంతా కాదు. పోచమ్మమైదాన్‌ కూడలి, మండిబజార్‌, చార్‌బౌళీ రోడ్డు, జేపీఎన్‌రోడ్డులకు ఇరువైపులా వీటి విక్రయాలు తెల్లవారుజాములో సహార్‌ వేళ వరకు కొనసాగుతున్నాయి. ముస్లింలతో పాటు వివిధ వర్గాల వారు వీటిని రుచిచూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌లో లభించే వివిధ రకాల వస్తువులన్నీ రంజాన్‌ మాసంలో మండిబజార్‌లో అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి.