రక్త దానంలో HIV రక్తo

ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణికి హెచ్‌ఐవీ సోకింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన మహిళకు హెచ్‌ఐవీ వైరస్ ఉన్న రక్తాన్ని ఎక్కించారు. విరుధునగర్‌ జిల్లాకు చెందిన ఓ గర్భిణి చికిత్స నిమిత్తం సత్తూర్‌ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఆమెకు రక్తం అవసరమవడంతో డిసెంబరు 3న శివకాశి ప్రభుత్వాస్పత్రి నుంచి తెప్పించి ఎక్కించారు. ఈ రక్తాన్ని దానం చేసిన వ్యక్తి ఇటీవల ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా విదేశాలకు వెళ్లేందుకు వైద్యపరీక్షలు చేయించుకున్నాడు. ఆ పరీక్షల్లో అతడికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది.
దీంతో అతడు శివకాశి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి రక్తదాన రిపోర్టును అడిగారు. అందులోనూ అతడికి హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే అక్కడి సిబ్బంది సత్తూర్‌ ప్రభుత్వాస్పత్రికి సమాచారమిచ్చారు. అప్పటికే ఆ రక్తాన్ని సదరు గర్భిణికి ఎక్కించడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైరస్‌ ఉన్న రక్తాన్ని ఎక్కించడంతో ఆమెకు కూడా హెచ్‌ఐవీ సోకింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఆసుపత్రిపై కేసు పెట్టారు.

రక్తం దానం చేసినప్పుడు శివకాశి ప్రభుత్వాస్పత్రిలోని సిబ్బంది హెచ్‌ఐవీ పరీక్షలు చేయలేదని, అందుకే ఈ తప్పిదం జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనకు బాధ్యులైన ఇద్దరు ల్యాబ్‌ సిబ్బంది, ఓ కౌన్సిలర్‌ను సస్పెండ్‌ చేశారు. వైరస్‌ సోకిన గర్భిణికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆమె కడుపులో ఉన్న బిడ్డకు హెచ్‌ఐవీ ఉందా లేదా అన్నది శిశువు జన్మించిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు. తమిళనాడులోని విరుధునగర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.