నియోజకవర్గం లోని అన్ని చెరువులు రెండు పంటల నీరందించగలిగే సామర్థ్యాన్ని సాధించాలనేదే తన లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.

Advertisement

ఈ దిశగా చిన్నపెండ్యాల గ్రామంలో గ్రామస్తుల సమిష్టి కృషితో తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించుకున్న చెక్ డ్యాం ను ఈ రోజు పరిశీలించారు. గ్రామంలోని మల్లంకుంట్ల, గార్ల కుంట చెరువులకు చెక్ డ్యాం ద్వారా నీరు నింపుకోవడం, రెండు పంటల నీటి సాధనతో గ్రామస్తులు ఇతర గ్రామాలకు ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. ఈ తాత్కాలిక నిర్మాణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో శాశ్వత ప్రాతిపదిక నిర్మాణంగా ఒక ఏడాదిలోగా పూర్తి చేస్తామని గ్రామస్తుల హర్షద్వానాల మధ్య తెలిపారు.

తనకు రాజకీయ జన్మ నిచ్చిన ఘన్ పూర్ నియోజక వర్గ గ్రామాల సమగ్ర అభివృద్ధి పరమావధిగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న తాటికాయల గ్రామ సమీపంలో ఆకేరు వాగు పై పది లక్షల రూపాయల ఎం ఎమ్మెల్సీ నిధులతో నిర్మితమైన చెక్ డ్యాం ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పాగాల సంపత్ రెడ్డి, జనగామ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎడవెళ్లి.కృష్ణా రెడ్డి, గ్రామ సర్పంచ్ మామిడాల లింగారెడ్డి, ఎంపీటీసీ తాళ్లపల్లి ఉమా సమ్మయ్య, గ్రామ మండల మాజీ జెడ్పీటీసీలు స్వామి నాయక్, రాజేష్ నాయక్ లు వివిధ గ్రామాల సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.