రాజీవ్ రహదారిపై ఉన్న లక్ష్మక్కపల్లి క్రాస్ రోడ్డువద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం పాలు కాగా మృతుని భార్య తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వరంగల్ జిల్లా నారాయణ పూర్‌కు చెందిన జంగిలి యాదయ్య, అతని భార్య బుచ్చవ్వలు టీవీఎస్ బైక్ పై ములుగు మండలం లక్ష్మక్కపల్లిలో ఉన్న ఆర్వీఎం ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చారు. దంపతులిద్దరూ తిరుగు ప్రయాణంలో లక్ష్మక్కపల్లి క్రాస్ రోడ్డును దాటి హైదరాబాద్ వైపు రాజీవ్ రహదారిపైకి తమ వాహనాన్ని ఎక్కిస్తుండగా అదేక్షణంలో వేగంగా సిద్దిపేట వైపు వెళ్తున్న లారీ ఢీకొనటంతో యాదయ్య(43) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని చూడటానికి వీలు లేనంతగా నలిగిపోయింది. అతని భార్య బుచ్చవ్వ తీవ్రగాయాలకు గురైంది.

మృతుని వాహనం లారీ కిందకు చొచ్చుకుపోయి నుజ్జయింది. సమాచారం అందిన వెంటనే ములుగు ఎస్సై రాజేంద్ర ప్రసాద్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రురాలైన బుచ్చవ్వను గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ప్రాథమిక దర్యాప్తు అనంతరం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. రాజీవ్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంతో చాలాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది..