రిటైర్మెంటు తర్వాత హెలికాప్టర్ లో ఇంటికి వెళ్లిన పాఠశాల అటెండర్…

ఉద్యోగులకు పదవీవిరమణ అనేది తప్పనిసరి. అయితే, ప్రతి ఒక్కరూ తమ పదవీవిరమణ ఎంతో సంతోషకరం ఉండాలని ఆశిస్తుంటారు. సహచరులను, పనిచేసే కార్యాలయాన్ని వదిలిరావడం కొంత భావోద్వేగాలతో ముడిపడి ఉన్నా, అప్పటివరకు అలసిన శరీరం, మనసుకు విశ్రాంతి అవసరం. చాలామంది రిటైర్మెంటు ఫంక్షన్ అనంతరం కోలాహలంగా ఊరేగింపుతో ఇంటికి చేరుకోవాలని భావిస్తుంటారు. కానీ, హర్యానాలోని ఓ పాఠశాల అటెండర్ ఏకంగా హెలికాప్టర్ లో ఇంటికి వెళ్లాడు. అందుకోసం లక్షల ఖర్చయినా వెనుకాడలేదు. కూరే రామ్ ఫరీదాబాద్ జిల్లాలోని నీమ్కా ప్రాంతంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి ఉద్యోగి. అక్కడే 40 ఏళ్ల పాటు పనిచేశాడు. తాజాగా, పదవీవిరమణ చేశాడు. పాఠశాల నుంచి కూరే రామ్ నివాసం ఉండే ప్రాంతం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే అందరిలా కాకుండా ఓ హెలికాప్టర్ లో తన నివాసానికి వెళ్లాలన్నది కూరే రామ్ కల అని అతడి సోదరుడు, గ్రామ సర్పంచ్ అయిన శివకుమార్ తెలిపాడు. కాగా, హెలికాప్టర్ అద్దె రూ.3.5 లక్షలు అయినా కూరే రామ్ వెనుకంజ వేయలేదు. తాను పొదుపుచేసిన డబ్బుతో హెలికాప్టర్ అద్దెకు తీసుకుని సగర్వంగా తన ఇంటికి చేరుకున్నాడు. హెలికాప్టర్ లో దిగిన కూరే రామ్ కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here