రేపు, ఎల్లుండి భారత్ బంద్

రేపు, ఎల్లుండి దేశవ్యాప్తంగా బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. కార్మిక సంఘాల పిలుపు మేరకు జరగనున్న భారత్ బంద్ లో పాల్గొనాలని బ్యాంకు ఉద్యోగులు నిర్ణయించారు. ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయి అసోసియేషన్ జనవరి 8-9 సమ్మెలో పాల్గొననుంది. ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 సవరణ ద్వారా ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని సీఐటీయు జాతీయ కార్యదర్శి తపన్ సేన్ గుప్తా ఆరోపించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే కార్మిక సంఘాల అధికారాలకు తెరపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను, ఉద్యోగులను అణిచివేసేందుకు ప్రయత్నం ప్రయత్నిస్తోందన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు జనవరి 8-9న భారత్ బంద్ నకు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. కేంద్రం పారిశ్రామికవేత్తలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించాయి. తమ 12 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచాయి. 10 పెద్ద ట్రేడ్ యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొననున్నట్టు తెలిపాయి. ఆలిండియా కిసాన్ మహాసభ కూడా ట్రేడ్ యూనియన్ల దేశవ్యాప్త బంద్ ను స్వాగతించింది. ఈ సమ్మెలో భాగంగా భారత్ బంద్, రైల్ రోకో, రోడ్ రోకో, నిరసన ప్రదర్శనలు, ఇతర ఆందోళనలు చేపట్టనున్నారు. 

కార్మిక సంఘాల భారత్ బంద్ పిలుపు మేరకు ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్, మరో 30 ప్రజా సంఘాలు కూడా 8 జనవరిన అస్సాం బంద్ కు పిలుపునిచ్చాయి. నార్త్ ఈస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా ఈ బంద్ లో పాల్గొననున్నట్టు ప్రకటించింది. జనవరి 8న అస్సాంతో పాటు 7 ఈశాన్య రాష్ట్రాలు కూడా పాల్గొంటున్నాయి.