ప్రభుత్వం ఉద్యాన పంటలు పండించే రైతులకు కల్పించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఉద్యాన అధికారిణి ఎం. యమునా కోరారు. శుక్రవారం వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఉద్యాన శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యాన అధికారిణి యమునా మాట్లాడుతూ కూరగాయ పంటలు, తీగజాతి పంటలు,షెడ్ నెట్, ప్లాస్టిక్ బుట్టలు,మల్చింగ్, శాశ్వత పందిళ్లు, పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం ఎన్నో రకాలుగా రాయితీ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు.

అందులో భాగంగా కురాగాయల పంటలకు గాను నేరుగా విత్తనాలు పంట పొలంలో వేసి పండించే పంటలకు బెండ, దోస, ఆకుకూరలు, పుచ్చ, ఉల్లి, తీగజాతిలో సొర, కాకర, బీర, పంటల విత్తనాలు సబ్సిడీ ద్వారా ఎకరాకు 1200 సబ్సిడీ కల్పిస్తుందని తెలిపారు. సబ్సిడీ పొందాలంటే రైతు ఖరీదు చేసిన విత్తనాల రశీదు, ఆధార్ బ్యాంక్ ఖాతా పుస్తకం, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ప్రతులను ఉద్యాన శాఖ అధికారులకు సమ్పర్పించాలని, పంట వేసిన భూమిని ఉద్యాన అధికారి పర్యవేక్షణ అనంతరం రైతుకు సబ్సిడీ అందుతుందన్నారు. అదేవిధంగాతీగ జాతి పంటలైన బీర, కాకర, చిక్కుడు వంటి తీగ అల్లుకునే పంటలను క్రిపర్ మెష్ పై వేసుకోవచ్చన్నారు. క్రిపర్ మెష్ నిర్మాణానికి ఒక ఎకరాకు 1,44,600 .రూపాయలు ఖర్చు అవుతుందని , దానికి గాను ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ రూపంలో ఎకరాకు 70000 రూపాయలు చెల్లిస్తుందని అన్నారు.

షేడ్ నెట్ ల ధ్వారా వేసవి కాలంలో నీటి సరఫరా ఉండి పంటలు పండించే రైతులకు అధిక ఉష్ణోగ్రత నుండి పంటలు కాపాడుకునేందుకు దోహద పడుతాయన్నారు. రైతులు పండించిన పంటలు, కూరగాయలు మార్కెట్టుకు తరలించేందుకు వీలుగా 23 కిలోల ప్లాస్టిక్ బుట్టలు 140 రూపాయలకు ఒకటి చొప్పున గరిష్టంగా ఒక రైతుకు 40 బుట్టలు అందించనున్నట్లు తెలిపారు. డ్రిప్ సౌకర్యం వుండి కూరగాయల పంటలు పండించే రైతులకు కలుపు నివారణకు మల్చింగ్ పేపర్ ఉపయోగించినట్లైతే అధిక దిగుబడి వస్తుందని, దానికి కూడా సబ్సిడీపై ఎకరాకు 6400 రూపాయలు సబ్సిడీ వస్తోందని వివరించారు.

అంతేకాకుండా తీగజాతి కూరగాయలు పండిచేందుకు వీలుగా శాశ్వత పందిళ్లు వేసుకుని వాటికి కూడా సబ్సిడీ పొందవచ్చునని,అందుకు ఎకరాకు 50 శాతం సబ్సిడీ ద్వారా 1లక్ష రూపాయల సబ్సిడీ వస్తుందన్నారు.

వివిధ రకాల పండ్ల తోటలైన మామిడి, దానిమ్మ, జామ, ఆపిల్ బేర్, నిమ్మ, బత్తాయి తోటలు పెట్టుకునేందుకు సాగుకు అయ్యే ఖర్చులో 40 శాతం సబ్సిడీ లభిస్తుందని పేర్కొన్నారు. కాబట్టీ రైతులు ఈ యొక్క పథకాలు సద్వినియోగం చేసుకుని లాభాలను పొందాలని సూచించారు. రైతులు సబ్సిడీ కొరకు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాతా పుస్తకం, ఆధార్ జిరాక్స్ ప్రతులతో వర్ధన్నపేట ఉద్యాన అధికారిణి యమున సెల్ 7997725087 లో సంప్రదించాలని సూచించారు…