రైలులో మాజీ MLA దారుణ హత్య

గుజరాత్ రాష్ట్రానికి చెందిన BJP మాజీ ఎమ్మెల్యే జయంతిలాల్ భానుషాలి కటారియా పట్టణం నుంచి సురభి రైల్వే స్టేషన్ల మధ్య సయాజీ నగరి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. జయంతిలాల్ భానుషాలి భుజ్ నుంచి అహ్మదాబాద్ నగరానికి ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రైలులోనే కాల్చిచంపారు. భద్రతా వైఫల్యం వల్లనే ఏసీ రైలు బోగీలో కాల్పులు జరిగాయని, దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. రైలులో ఓ తుపాకీని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

అత్యాచారం కేసు

పాత కక్షలతో మాజీ ఎమ్మెల్యేను హతమార్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా హత్యకు గురైన జయంతిలాల్ తనపై పలుసార్లు అత్యాచారం చేసి, వీడియో తీశారని 21 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాలలో సీటు ఇప్పిస్తానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని గతంలో యువతి ఫిర్యాదు చేశారు.