రైల్వేశాఖ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. విమానాశ్రయాల తరహాలో భద్రతా ఏర్పాట్లను ప్రవేశపెట్టాలని చూస్తోంది. విమానం ఎక్కే వారు కనీసం గంట ముందు విమానాశ్రయానికి చేరుకుని తనిఖీలు జరిపించుకోవాల్సి ఉంటుంది. అదేతరహాలో ఇప్పుడు రైల్వేశాఖ అదే పద్ధతి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రైలెక్కాలంటే అరగంట ముందే వచ్చి భద్రతా తనిఖీలు చేయించుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ఇందులో అత్యాధునికమైన ఫేసియల్ రికగ్నిషన్ పరికరాలు ఉపయోగిస్తారు. ఈ విధానంతో సంఘవిద్రోహ శక్తులను ఈజీగా గుర్తించే వీలుంటుంది. అయితే ప్రతి ప్రయాణికుడిని తప్పనిసరిగా తనిఖీ చేయడం ఉండకపోవచ్చు. అవసరమనిపించిన వారిని మాత్రమే తనిఖీ చేస్తారు.
2016లో ఆమోదం పొందిన సమగ్ర భద్రతా వ్యవస్థలో భాగంగా దేశ వ్యాప్తంగా ముందుగా 202 స్టేషన్లలో ఈ కొత్త విధానం ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రాజెక్టును రూ.385 కోట్లతో చేపడుతున్నారు. రాబోయే కుంభమేళా దృష్ట్యా ప్రయాగ్‌రాజ్‌లో ఇప్పటికే ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. కర్ణాటకలోని హుబ్లీలోనూ పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు రైల్వే అధికారులు.