చేపలు, చికెన్, మటన్, రొయ్యలు మరియు మనకు తినేందుకు అనేక రకాల మాంసాహారాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అనేక మంది చికెన్, మటన్‌లను ఎక్కువగా తింటుంటారు. ఇక కొందరు కేవలం సీ-ఫుడ్‌ కే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఏ మాంసాహారం అయినా సరే.. రోజూ తినవచ్చా ? తింటే ఏమవుతుంది ? దీనికి వైద్యులు ఎలాంటి సమాధానం చెబుతున్నారు.. మనం తినే ఏ మాంసాహారంలో నైనా ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే మటన్‌లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. చికెన్, చేపలు, రొయ్య‌ల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను అధికంగా తింటే శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్), ట్రై గ్లిజరైడ్లు చేరతాయి. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. అలాగే హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకని కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను తక్కువగా తినాలి. ఈ క్రమంలోనే నిత్యం ఏ మాంసాహారం అయినా సరే, అందులో కొవ్వు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మన శరీరానికి నిత్యం కావల్సిన కొవ్వు పదార్థాల మోతాదు మించకుండా మాంసాహారాలను తినాలి. ఇలా తింటే రోజూ మాంసాహారం తిన్నా ఎలాంటి దుష్పరిణామాలు కలగవు. ఇక చికెన్, చేపలను రోజూ తినవచ్చు. కాకపోతే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శరీరానికి ప్రోటీన్లు లభించి కణజాల నిర్మాణం జరుగుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. అయితే కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు మాంసాహారాలను తినడం మంచిది. లేదంటే సమస్యలు మరింత ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది…