రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందిన సంఘటన చందుపట్ల గ్రామ సమీపంలోని కుమ్మరిగూడెం వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు, రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని కేసారం గ్రామానికి చెందిన బాల్ధ పూజిత(21)కు గుండాల మండలంలోని బ్రాంహ్మణపల్లికి చెందిన బెజాడి కుమారస్వామి కుమారుడు నరేశ్(29) గత నెల 22న వివాహమైంది. ఈక్రమంలో నూతన దంపతులు బ్రాంహ్మణపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై కేసారం గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో కుమ్మరిగూడెం గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనక వైపు నుండి ఢీకొట్టారు. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న పూజిత, నరేశ్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్ తెలిపారు.