ఓ మహిళ తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. భర్త మృతిచెందాడనే వార్త తెలిసిన వెంటనే దిగ్భ్రాంతి చెందిన ఆమె, ఆరు నెలల కుమారుడి చంపేసి, తర్వాత తన ప్రాణాలను కూడా తీసుకుంది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో చోటుచేసుకుంది చోటుచేసుకుంది. 36 ఏళ్ల గంగాధర్ బి కమ్మర అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య శ్రుతి, ఆరు నెలల కుమారుడు అభిరామ్ ఉన్నాడు. మంగళూరులోని అగ్నిమాపక దళంలో గంగాధర్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే గంగాధర్ శనివారం రాత్రి 8.50 గంటల సమయంలో మంగళూరులోని కుంటికాన వద్ద రోడ్డు దాటుతుండగా ఎస్‌యూవీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ తెలిపారు. ఎస్‌యూవీ బెంగళూరు నుంచి కుందాపూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదంపై మంగళూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గంగాధర్ మృతిపై అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఇక, గంగాధర్ భార్య శ్రుతి ప్రస్తుతం రాయచూర్‌ జిల్లా లింగసుగూర్‌లోని సోదరుడి ఇంట్లో ఉంటుంది. ఆమె డెలివరీ తర్వాత అక్కడే ఉండిపోయింది. అయితే భర్త చనిపోయిన విషయం తెలిసిన తర్వాత శ్రుతి కొడుకు అభిరామ్‌ను హత్య చేసి ఆ తర్వాత ఆమె బలవన్మరణానికి పాల్పడింది. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా సమాచారం. శ్రుతి ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి లింగసుగూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.