లేడిస్ హాస్టల్స్‌లో సీక్రెట్‌గా కెమెరాలు అమర్చి

హాస్టల్స్‌లో ఉండే అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు.

లేడిస్ హాస్టల్స్‌లో సీక్రెట్‌గా కెమెరాలు అమర్చి, వారి వీడియోస్‌ను రికార్డు చేస్తున్న యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదంబాక్కం తిల్లై నగర్‌లో సంజీవి అనే వ్యక్తి తన నివాసం రెండో అంతస్తులో లేడిస్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఇందులో పది మందికి పైగా అమ్మాయిలు అద్దెకు ఉంటున్నారు. ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఓ యువతికి తాము ఉంటున్న గదిలో రహస్య కెమెరాలు ఉన్నాయన్న అనుమానం వచ్చింది.

ఆ కెమెరాల‌ను ఎలా కనిపెట్టాలని గూగుల్ సెర్చ్‌ చేస్తే సాఫ్ట్‌వేర్‌ లభ్యమైంది. సాఫ్ట్‌వేర్‌ను తన ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న యువతి తన గదిలోని లైట్లు, స్విచ్ బోర్డులు, బాత్రూమ్ అంతా వెతికింది. దీంతో అసలు బండారం బయటపడింది. రూమ్‌లో చిన్నచిన్న కెమెరాలు ఆమె కంటపడ్డాయి. హాస్టల్ యువతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కెమెరాలను, కొన్ని అనుమానాస్పద పరికరాలు స్వాధీనం చేసుకుని హాస్టల్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారించారు.

తన నివాసం నుండే వైఫై ఆన్ చేసి బ్లూటూత్ కెమెరాల్లో రికార్డైన అమ్మాయిల వీడియోలను తన ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని చూస్తున్నట్లు విచారణలో సంజీవి తెలిపాడు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో చాలా‌ మంది అమ్మాయిల వీడియోలు ఉండటం గమనించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై గతంలో కూడా కేసులు ఉన్నట్టు గుర్తించారు.