అమరావతి గ్రామాల్లో కాపలాఉన్న మందడం హైస్కూల్‌లో మహిళా కానిస్టేబుల్‌ దుస్తులు మార్చుకుంటుండగా కొన్ని మీడియా చానళ్లు వీడియో ద్వారా చిత్రీకరించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విధుల నిమిత్తం మందడంకు వచ్చిన కానిస్టేబుల్‌ డ్యూటీ అనంతరం హైస్కూల్‌లో వారికి కేటాయించిన గదిలోకి వెళ్లారు. దుస్తులు మార్చకుంటుండగా కొన్ని చానళ్ల సిబ్బంది గది కిటికీల నుంచి రహస్యంగా వీడియో రికార్డు చేశారని ఆ కానిస్టేబుల్‌ ఆరోపించారు.

పాఠశాలలో ఖాళీగా ఉన్న రూములను తమకు కేటాయించారని, తమ అనుమతి లేకుండా రూమ్‌లోకి చొరబడి అసభ్యకరంగా వీడియోలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనిపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తానని ఆ పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై సంబంధిత పాఠశాల హెడ్‌ మాస్టార్‌ కోటేశ్వరరావు స్పందించారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న గదులను మహిళా కానిస్టేబుల్స్‌కు కేటాయించామని, వారిపై ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు.