లైంగిక సుఖం కోసం వేశ్య దగ్గరికి వెళ్లిన ఓ వ్యక్తి ఆమెను ఆ కూపం నుంచి బయటపడేసి హీరోగా మారాడు. అందరిలా ఆమెతో పడక సుఖం పంచుకోకుండా బాధను అర్థం చేసుకుని ఆమె బంధువులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు మహిళా కమిషన్‌ను ఆశ్రయించి యువతిని రక్షించుకున్నారు. తమ బిడ్డ ఆచూకీ చెప్పిన వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు. ఇదేదో సినిమా స్టోరీలా ఉందనిపించొచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన సినిమా ట్విస్టులకు ఏమాత్రం తీసిపోదు. కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలోకి ఓ పని నిమిత్తం వెళ్లాడు. కాస్త ఖాళీ సమయం దొరకడంతో లైంగిక సుఖం కోసం జీపీ రోడ్డులోని వేశ్యా వాటికకు వెళ్లాడు. అక్కడ ఓ యువతిని సెలెక్ట్ చేసుకుని గదిలోకి తీసుకెళ్లాడు. మాటల మధ్యలో ఆమె బెంగాలీ అని తెలుసుకున్న ఆ వ్యక్తి వివరాలు ఆరా తీశాడు. తాను కోల్‌కతాలో ప్రైవేటు ఉద్యోగం చేసేదానినని, వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోక మంచి ఉద్యోగం వెతుకుతున్న సమయంలో ఓ మహిళ జాబ్ ఇప్పిస్తామని నమ్మించి ఢిల్లీకి తీసుకొచ్చి వ్యభిచార ముఠాకు అమ్మేసిందని చెప్పి బాధితురాలు బోరుమంది. తనను బయటకు వెళ్లకుండా నిర్బంధించారని, రోజుకు ఎంతమంది కస్టమర్లు వచ్చినా సుఖ పెట్టాలని, ఎదురు తిరిగితే చావబాదుతారని చెప్పింది. ఆమె పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన ఆ వ్యక్తి వచ్చిన పని మరిచిపోయి ఆమెకు కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఆమె సోదరుడి ఫోన్ నంబర్, అడ్రస్ కనుక్కొని వెళ్లిపోయాడు. బయటకు వెళ్లాక ఆమె సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తమ సోదరి కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న అతడు అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌తో అప్రమత్తమయ్యాడు. వెంటనే ఢిల్లీకి వెళ్లి అతడిని కలుసుకున్నాడు. నిర్ధారించుకునేందుకు తానే కస్టమర్‌గా వెళ్లి సోదరిని చూసి షాకయ్యాడు. యువతి సమాచారం ఇచ్చిన వ్యక్తితో కలిసి ఢిల్లీ మహిళా కమిషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కమిషన్ ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు గురువారం వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసి యువతికి విముక్తి కలిగించారు. ఆమెను మోసం చేసిన మహిళపై కేసు నమోదు చేశారు…