తెరాస అధిష్ఠానం నిర్ణయం

అభ్యర్థి ఎంపికకు కేటీఆర్‌ సమాలోచనలు

తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌ నగరపాలక సంస్థ మేయరు పదవిని ఓసీ అభ్యర్థికి ఇవ్వాలని తెరాస అధిష్ఠానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. వరంగల్‌ మేయరుగా ఉన్న నన్నపనేని నరేందర్‌ వరంగల్‌ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి మేయర్‌ పదవికి రాజీనామా చేశారు. ఆ పదవిని భర్తీ చేసే ప్రక్రియను సీఎం కేసీఆర్‌ , పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు అప్పగించారు. ఆయన ఇప్పటికే పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో చర్చలు ప్రారంభించారు.

వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ ఈ రెండు నియోజకవర్గాలు పూర్తిగా వరంగల్ మహానగర పరిధిలో ఉండటం వల్ల ఈ రెండు స్థానాల ఎమ్మెల్యేలు బీసీ వర్గాలకే కేటాయించారు. అయితే ప్రస్తుతం మేయర్ స్థానం జనరల్ కేటగిరికే వెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయని పార్టీలో చర్చ జరుగుతున్నది. ఒకవేళ జనరల్ కేటగిరీకి కేటాయిస్తే , ఈ స్థానం కోసం కారొపరేటర్లు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకయ్యారు. జనరల్ స్థానంలో జనరల్ మహిళకు అవకాశం దక్కుతుందా..? పురుషులకు దక్కుతుందా..? అన్నది ఆసక్తిగా మారింది. మహిళకు అయితే గుండు ఆశ్రితారెడ్డి పేరు ప్రముకంగా వినిపిస్తుంది , నల్లా స్వరూపాణిరెడ్డి కూడా మేయర్ పదవిని ఆశిస్తున్నారు. ఇక పురుష కార్పొరేటర్లలో గుండా ప్రకాశ్ , వద్దిరాజు గణేశ్ ఆశిస్తున్నారు .

58 మంది కార్పొరేటర్లున్న నగరపాలక సంస్థలో తెరాసకు సంపూర్ణ మెజారిటీ ఉంది. ఓసీ స్థానమైనప్పటికీ గతంలో బీసీ అభ్యర్థి నన్నపనేనికి పార్టీ ఈ పదవిని ఇచ్చింది. స్టేషన్‌ఘన్‌పూర్‌, వర్ధన్నపేటల్లో ఎస్సీ అభ్యర్థులు, పరకాలలో ఓసీ అభ్యర్థి గెలిచారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలు, శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఓసీలకు స్థానం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది. మేయరు పదవికి మొత్తం 8 మంది పోటీపడుతున్నట్లు తెలిసింది. తెరాస మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి శనివారం కేటీఆర్‌ను కలిసి మేయర్‌ పదవిని తన కోడలికి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే kCR మరియు KTR కూడా సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది , ఇక ఆశావహులైన కార్పొరేటర్లు.. జిల్లాలో ఎమ్మెల్యేల ద్వారా తమ వినతిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. వరంగల్‌ వ్యాపార, వాణిజ్య రంగాలకు ప్రసిద్ధి చెందినందున ఆ సామాజికవర్గం అభ్యర్థికి మెరుగైన అవకాశాలున్నట్లు సమాచారం.

సాధ్యమైనంత తొందరలోనే వరంగల్ మేయర్ స్థానానికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో షెడ్యూల్ కూడా త్వరలో విడుదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది