వరంగల్: పొలానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాడనే కోపంతో తమ్ముడిని అన్న హత్య చేసిన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ గ్రామీణ మండలంలోని అమనగల్‌ శివారు కస్నాతండాకు చెందిన అన్నదమ్ములు లూనావత్‌ రమేశ్‌, శ్రీను అమనగల్‌కు చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ భూమిని వేర్వేరుగా కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. సోమవారం శ్రీను తన పొలంలో నాటు వేశాడు. రమేశ్‌ తన పొలంలోకి వెళ్లాలంటే శ్రీను నాటు వేసిన భాగంలోనుంచే వెళ్లాలి. ఈ క్రమంలో మంగళవారం రమేశ్‌ పొలం దున్నేందుకు ట్రాక్టర్‌తో వెళుతుండగా.. నాటు వేసిన పొలంలో నుంచి వెళ్లొద్దంటూ శ్రీను అడ్డం తిరిగాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శ్రీను పక్కకు జరగకపోవడంతో కోపోద్రిక్తుడైన రమేశ్‌ ట్రాక్టర్‌ని అతడి పైనుంచి తీసుకెళ్లాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీనును స్థానిక రైతు ఒకరు తన ద్విచక్రవానంపై జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతురాలి భార్య సంత్రాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.