‌అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం నారాయణగిరి వడ్డెర కాలనీలో ఆలకుంట గట్టమ్మ(34) అనే మహిళను తన భర్త ఆలకుంట రాజు మంచం కోడుతో తలపై కొట్టి హతమార్చిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ధర్మసాగర్‌ సీఐ సాదుల్లా బాబా, ఎస్‌ఐ విజయ్‌రాంకుమార్‌, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి పిల్లలు బుధవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి తలుపులు తీసి చూసేసరికి ఆమె రక్తపు మడుగులో ఉంది. తల్లిని చూసి ఆందోళనతో పిల్లలు కేకలు వేయడంతో సమీపంలోని వారు వచ్చి చూశారు. అప్పటికే ఆమె మృతి చెంది ఉండగా ఇంట్లో ఎవరూ లేరు. తన భర్తనే మంచం కోడుతో తలపై వెనుకభాగాన కొట్టి ఆమెను హత్య చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. భర్త రాజు ఆమెను గతంలో పలుమార్లు కొట్టాడని, తను నిత్యం తాగుతూ మానసిక రోగిగా వ్యవహరించేవాడని తెలిపారు. అతడు గతంలో దొంగతనం కేసులో ఒకసారి, భార్యను కొట్టిన కేసులో మరోసారి జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి మెడలో తాళిపుస్తే లేదని, దాన్ని అతడే తీసుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతురాలికి రమేష్‌(14), శిరీష(12), శ్యామల(10) ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలియగానే స్థానిక సీఐ సాదుల్లా బాబా, ఎస్‌ఐ విజయ్‌రాంకుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు…