వ్యవసాయ బావివద్ద పనులు చేసుకుంటున్న ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా చిల్పూర్ మండలంలో చోటుచేసుకుంది. బుధవారం చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన మోటం లక్ష్మీ తమ వ్యవసాయ బావి వద్ద పనులు చేసుకుంటుండగా ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో లక్ష్మీకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను వెంటనే హన్మకొండలోని రోహిణి ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో రాజవరం గ్రామ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామ శివార్లలో కూడా ఎలుగుబంట్లు తిరుగుతుండడంతో. బావి వద్దకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. రాజవరం గ్రామ శివారులో ఎలుగుబంటి సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.