వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీలో ఇద్దరు నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. పోటాపోటీగా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థిని తానంటే తాను అని సిగపట్లు పడుతున్నారు. హనుమకొండ జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, జనగామ జిల్లా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఒకరి సస్పెన్షన్‌ వరకు దారి తీసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ జనగామ డీసీసీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పార్టీ సభ్యత్వం రద్దు చేస్తూ ఆయనను సస్పెండ్‌ చేసినట్లు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ జంగాకు పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసు ఇచ్చినా పట్టించుకోకుండా హనుమకొండ జిల్లాలో తిరుగుతూ తనపై అనుచిత వ్యాక్యలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఐకమత్యానికి విఘాతం కలిగిస్తున్నారన్నారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం 26 జూలై 2021న తమ ఇద్దరిని సమావేశపరిచి భవిష్యత్‌లో ఇలా జరుగొద్దని సూచనలు చేసిందన్నారు. అయినా ఆయనలో మార్పు రాకపోవడంతో క్రమశిక్షణ సంఘం మళ్లీ 2 మే 2022న షోకాజ్‌ నోటీసు ఇచ్చినట్లు నాయిని తెలిపారు.

Advertisement

పార్టీ ఆదేశాలను ధిక్కరించినందున జంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడంతో పాటు సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లో వస్తాయని స్పష్టం చేశారు. జంగా వెనుకాల ఉన్న నాయకులను సైతం త్వరలోనే సాక్ష్యాలతో సహా బయటపెడుతానని నాయిని తెలిపారు. పక్క జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తానంటూ తిరగడం జంగా అవివేకానికి నిదర్శనమన్నారు. ‘ఎక్కడి నుంచో నువ్వు ఇక్కడికి వస్తున్నావు నాది ఇక్కడే ఎల్‌కేజీ నుంచి సర్టిఫికెట్లు తీసుకొస్తా నేను ఇక్కడే చదువుకున్నా నా రాజకీయ జీవితంలో సగంలేడని, అధిష్ఠానం పట్టించుకోకుంటే సరైన నిర్ణయం తీసుకుంటా’ అని నాయిని అల్టిమేటం జారీ చేశారు. పోలీస్‌ శాఖ, హనుమకొండ జిల్లా ప్రభుత్వ అధికారులు రాఘవరెడ్డి చేపట్టే పార్టీ కార్యక్రమాలు, పాదయాత్రలకు అనుమతులు ఇవ్వొద్దని కోరారు. ఆయనకు కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్‌ తోట వెంకన్న, రామకృష్ణ, విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.