క్షణికావేశంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా చాలా మందిలో మార్పు రావడం లేదు. తాజాగా ఓ యువకుడు ఇదే కారణంతో ప్రాణాలు తీసుకున్నాడు. తల్లి తిట్టిందని మనస్థాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు ఆ యువకుడు తన స్నేహితుడికి వీడియో కాల్ చేశాడు. ఈ సంఘటన నగరంలోని బోయిన్‌పల్లి జరిగింది.
వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన వివేక్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి కుటుంబం కూడా కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చేసింది. దీంతో అందరూ కలిసి చింతల్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఇంటి దగ్గర ఉన్న వివేక్‌కు తల్లి పెరుగు తీసుకురమ్మని చెప్పింది.

ఎంత సమయం అవుతున్నా అతడు వెళ్లకపోవడంతో తల్లి తిట్టింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వివేక్, పెట్రోల్ తీసుకుని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాడు. అదే సమయంలో శివ అనే తన స్నేహితుడికి వీడియో కాల్ చేశాడు. అతడు చూస్తుండగానే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో భయపడిపోయిన శివ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, వాళ్లు అక్కడకు చేరుకునే సరికే వివేశ్ ప్రాణాలు కోల్పోయాడు. శివ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.