రాఘవాపూర్‌కు చెందిన నరేందర్, అనిత దంపతుల కుమారుడైన సాయికృష్ణ(22)కు రెండేళ్ల క్రితం అతడి తాత ఉప్పలయ్యకు చెందిన వీఆర్‌ఏ ఉద్యోగం కారుణ్య నియామకం కింద వచ్చింది. వీఆర్‌ఏగా విధుల్లో చేరిన అతను ప్రస్తుతం ఘన్‌పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో తాత్కాలికంగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో అతడి తల్లిదండ్రులు విడిపోగా తండ్రి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సాయికృష్ణ తల్లి కరీంనగర్‌లో అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. ప్రస్తుతం సాయిక్రిష్ణ తనతో పాటు వీఆర్‌ఏగా పనిచేస్తున్న ఎం.వెంకటస్వామితో కలిసి స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుకాల ఉన్న కాలనీలో ఓ గదిలో ఆరునెలలుగా అద్దెకు ఉంటున్నాడు. ఇక్కడ అద్దెకు ఉంటూ సెలవుల్లో కరీంనగర్‌లోని అమ్మ వద్దకు వెళ్తుంటాడు.

ఈ క్రమంలో కరీంనగర్‌కు చెందిన ఓ అమ్మాయితో అతడు ప్రేమలో పడినట్లు తెలిసింది. తరచూ ఆ అమ్మాయితో ఫోన్‌లో మాట్లాడడం, సెల్‌లో చాట్‌ చేసేవాడు. గురువారం రాఖీ పౌర్ణమి పండుగ రావడంతో వెంకటస్వామి హైదరాబాద్‌లోని తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లాడు. గదిలో ఒంటరిగా ఉన్న సాయికృష్ణ రాత్రి మద్యం ఫుల్‌బాటిల్‌ తెచ్చుకుని తాగాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో తన ప్రియురాలితో పాటు తల్లి, కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. అర్థరాత్రి దాటాక అతడు గది పైకప్పుకు ఉన్న కొండికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే హైదరాబాద్‌కు వెళ్లిన అతడి రూంమెట్, తోటి వీఆర్‌ఏ వెంకటస్వామి విధులకు హాజరయ్యేందుకు శుక్రవారం ఉదయం ఘన్‌పూర్‌కు వచ్చాడు.

వారి గదికి వెళ్లేసరికి తలుపు లోపల గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా లోపల నుంచి సమాధానం రాకపోవడంతో కిటికీలో నుంచి చూడగా సాయికృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తించాడు. వెంటనే ఇంటి యజమానికి సమాచారం అందించగా ఇంటియజమాని పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడి కు టుంబ సభ్యులకు పోలీసులు సమాచారమిచ్చి శవ పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీఆర్‌ఏ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సీఐ తెలిపారు. మృతుడి తల్లి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీఆర్‌ఏ మృతిపై రెవెన్యూ అధికారులు ప్రగాఢ సంతాపం తెలిపారు.