గుండెల్ని పిండేసే విషాదం. హృదయవిదారక దుర్ఘటన. రెండు కుటుంబాలకు తీరని శోకం. రహదారి ప్రమాదం అయిదు నిండు ప్రాణాల్ని కబళించింది. వృద్ధాప్యంతో మంచానపడ్డ తల్లికి కడుపుకోత మిగిలింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటలోని రహమత్‌నగర్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ పగడాల దుర్గప్రసాద్‌, ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు శాంతన్‌, అక్క పద్మజ, బావ రాజు శ్రీశైలం వెళ్లి దైవ దర్శనం చేసుకొని సోమవారం తిరిగి వస్తుండగా, రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన వరంగల్‌లో విషాదం నింపింది. విషయం తెలుసుకొన్న బంధువులు, మిత్రులు కాజీపేటలోని వీరి నివాసం వద్దకు వచ్చి కన్నీరుమున్నీరుగా రోదించారు.

Advertisement

ఒంటరైన తల్లి, కుమారుడు రహమత్‌నగర్‌కు చెందిన పగడాల పుల్లయ్య, పూలమ్మ దంపతులకు ఒక కుమారుడు దుర్గప్రసాద్‌. ఇద్దరు కూతుళ్లు పద్మజ, అంజని. వీరిలో దుర్గప్రసాద్‌ చిన్నవాడు. రైల్వేలో పనిచేసిన పుల్లయ్య 2002లో మృతిచెందారు. బాపూజీనగర్‌కు చెందిన విజయలక్ష్మితో దుర్గాప్రసాద్‌ వివాహం కాగా, వీరికి శ్రేయాస్‌, శాంతన్‌ ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆస్ట్రేలియాలో ఎంఎస్‌ చేస్తుండగా, చిన్న కొడుకు శాంతన్‌ హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లోని ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. దుర్గా ప్రసాద్‌ కానిస్టేబుల్‌గా నగరంలోని వివిధ ఠాణాల్లో పనిచేయడంలో వివిధ ప్రాంతాల్లో గుర్తింపు ఉంది. దుర్గప్రసాద్‌తో పాటు భార్య, చిన్న కుమారుడు మృతి చెందడంతో వృద్దాప్యంలో ఉన్న తల్లి పూలమ్మ, పెద్ద కుమారుడు శ్రేయాస్‌ ఒంటరయ్యారు. తాను పడిన కష్టం తన కుమారులు పడకూడదని దుర్గప్రసాద్‌ చిన్నప్పటి నుంచి పిల్లలను మంచి పాఠశాలలో చదివించి ఉన్నత విద్యవైపు వెళ్లేలా ప్రోత్సహించారు. వారు ప్రయోజకులై జీవితాల్లో స్థిరపడే సమయంలో ఆ కటుంబంలో తీరని విషాదం నిండింది. తనను కంటికి రెప్పలా చూసుకునే కొడుకు లేకపోవడంతో పూలమ్మ పరిస్థితి ఏమిటని స్థానికులు కంటితడి పెట్టారు.

సీటు బెల్టు ధరిస్తే ప్రాణాలు దక్కేవి!

అమనగల్లు సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంలో ఇన్నోవాకారులో ప్రయాణిస్తున్నవారు సీటు బెల్టు ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పేదని తెలుస్తున్నది. సీటుబెల్టు పెట్టుకున్న డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు సంఘటన్నా స్థలాన్ని పరిశీలిస్తే అవగతమవుతున్నది. సీటుబెల్టు పెట్టుకుని ఉంటే బతికేవారని పోలీసులు ప్రాథమిక విచారణలో భావిస్తున్నారు. కాగా, ప్రమాదానికి మీడియన్ (డివైడర్) లేకపోవడం కూడా ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు.