ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపానికి గురైన యువతి నిద్రమాతలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నల్లగుంట గ్రామ పంచాయితీ పరిధి గంపోనిపల్ల్లెకు చెందిన మేకల పోషయ్య-రమల రెండో కూతురు మమత (24) కు ఐదేళ్ల క్రితం లక్ష్మీదేవిపేటకు చెందిన గోస్కుల వినయ్‌(25)తో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరికీ ఒకే సామాజికవర్గం కావడంతో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు.

అయితే కొంతకాలంగా పెళ్లిచేసుకోవాలని మమత కోరుతుండగా వినయ్‌ దాటవేస్తూ వచ్చాడు. శనివారం ఉదయం మమత లక్ష్మీదేవిపేటలోని వినయ్‌ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో వినయ్‌ ఇంట్లో లేకపోవడంతో తిరిగి గంపోనిపల్లెకు వచ్చింది. మధ్యాహ్నం సమయంలో గంపోనిపల్లెకు వెళ్లిన వినయ్‌ నిన్ను పెళ్లిచేసుకోను, అంటూ ఖరాకండిగా చెప్పడంతో మనస్తాపానికి గురైన మమత నిద్రమాత్రలు మింగింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను ములుగు ఏరియా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతోంది. స్థానిక ఎస్సై బి. నరహరిని వివరణ కోరగా ఈ సంఘటనకు సంబంధించి తనకు ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.