బంగారు నగల వ్యాపార యజమానులను దృష్టి మరల్చి వెండి అభరణాలను చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాకు చెందిన నలుగురు నిందితులను శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసారు. ఇందులో ఒక మహిళ వున్నారు. అరెస్టు చేసిన ఈ నిందితుల నుండి పోలీసులు సుమారు 2లక్షల 80విలువ గల 7 కిలోల వెండి పట్టాగోలుసులతోపాటు ఒక ఆటో, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు అరెస్టు చేసిన వారిలో భూపాల్‌ పల్లి జిల్లా, మొగుళ్ళపల్లి మండలం, ఇస్సిపేట గ్రామానికి చెందిన మాస్‌ అన్నపూర్ణ, నెర్పటి శ్యాంబాబు, వరంగల్‌ రూరల్‌ జిల్లా నడికూడ మండలం, వరికోల్‌ గ్రామానికి చెందిన మాస్‌ తిరుపతి, దుగ్యాల అశోక్‌లను పోలీసుల అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితురాళ్ళు ఇస్సీపేట గ్రామానికి చెందిన గూడిపాక రాధ, శనిగరపు పూలమ్మ ప్రస్తుతం పరారీలో వున్నారు. వీరు జైలు నుండి విడుదలైన అనంతరం కూడా వీరూ మరోమారు గత ఎనిమిది నెలల కాలంలో పది చోరీలకు తెగబడ్డారు. ఇందులో భాగంగా నిందితురాళ్ళు పెద్దపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 4, బెల్లంపల్లిలో 3, మంచిర్యాలలో 2, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ మట్వాడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక చోరికి పాల్పడ్డారు.

నిందితులను అరెస్టు చేసి చోరీ సోత్తును స్వాధీనం చేసుకోవడం ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్‌ ఏ.సి.పి చక్రవర్తి, ఇన్స్‌స్పెక్టర్‌ నందిరాంనాయక్‌, హెడ్‌కానిస్టేబుళ్ళు శ్యాం సుందర్‌, సోమలింగం,కానిస్టేబుళ్ళు శ్రీకాంత్‌, రంజిత్‌,మహెందర్‌, మహిళా కానిస్టేబుళ్ళు రాజకుమారి, బిందులను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ అభినందించారు.