తంగళ్లపల్లి(సిరిసిల్ల): భర్తను కడతేర్చి, ప్రియుడితో కలిసి వెళ్లిపోదామని ప్లాన్‌ వేసిన కిలాడీ భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల రూరల్‌ సీఐ బి.ఉపేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం: తంగళ్లపల్లి మండలంలోని ఇంద్రానగర్‌ భరత్‌నగర్‌ కాలనీకి చెందిన చిట్యాల శైలజ–బాలకృష్ణలకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కాగా శైలజ తనకు వరుసకు మరిది అయ్యే చిట్యాల శ్రీకాంత్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం బాలకృష్ణకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని ఇద్దరినీ హె చ్చరించాడు. ఈ క్రమంలో బాలకృష్ణ తమకు అడ్డుగా ఉన్నాడని, అతన్ని ఎలాగైనా చంపాలనుకున్నారు.

గత మార్చి 3న శైలజ, శ్రీకాంత్‌లు కలిసి పొలం వద్ద కరెంట్‌ షాక్‌ పెట్టారు. కానీ అదృష్టవశాత్తు బాలకృష్ణ తృటిలో తప్పించుకున్నాడు. అతను చనిపోలేదని గ్రహించిన శైలజ, శ్రీకాంత్‌లు భయంతో ఇంటి నుంచి పారిపోయారు. బాలకృష్ణఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు వరంగల్‌లో తలదాచుకున్నట్లు గుర్తించి, మంగళవా రం ఉదయం అరెస్టు చేసి, సిరిసిల్లకు తరలించారు. శైలజ, శ్రీకాంత్‌లను రిమాండ్‌కి తరలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన పోలీస్‌ సిబ్బందిని ఆయన అభినందించారు.