హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చేనెలలో జరిగే మేడారం జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. అలాగే వారాంతపు సంతల్లో కొవిడ్‌ జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరస్తారా అని హైకోర్టు ఆరా తీయగా, ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కరోనా పరిస్థితులపై విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. మరోవైపు రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16%గా ఉండగా, ఇప్పటివరకు 77 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే జరిపి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేసినట్లు డీహెచ్‌ హైకోర్టుకు తెలిపారు._