ప్రతీ రోజు రోడ్లపై వాహనాలతో పాటు ప్రజలు పెద్దఎత్తున సంచరిస్తుండడంతో నిత్యం ట్రాఫిక్‌ జామ్‌లు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని చోట్ల చిరువ్యాపారులు రోడ్లపై అమ్మకాలు జరుపుతుండడంతో కొందరు వాహనాలు రోడ్లపై పార్కింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలుమార్లు జరిమానాలు విధించినా వారిలో మార్పు రావడం లేదు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. వాహనాలను ఎక్కడ రాంగ్‌ పార్కింగ్‌ చేసినా పోలీసులు లిఫ్ట్‌ వాహనంలో ఠాణాలకు తరలిస్తున్నారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ కార్లు, ద్విచక్రవాహనాలు పార్కింగ్‌ చేసే వారు తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.

కోన్‌ పెట్టి సమాచారమిస్తారు..

షాపింగ్‌ చేయడానికి వెళ్లి వచ్చిన వారి వాహనం కనిపించకుండా పోయిందనే కంగారు పడకుండా ఉండేందుకు పోలీసులు పలు మార్గాలను అనుసరిస్తున్నారు. కార్లు, ద్విచక్రవాహనాలు పోలీసు లిఫ్ట్‌ వాహనంతో తరలించిన చోట ఒక కోన్‌ను అమర్చుతారు. లేదా అక్కడి షాపు యజమానులకు సమాచారం ఇస్తారు. అడ్డదిడ్డంగా వాహనం పార్కింగ్‌ చేసినందుకు సదరు పోలీసు అధికారి సమక్షంలో వాహనం తీసుకెళ్లినట్టు ఒక పేపర్‌ కోన్‌కు అంటించి సెల్‌నెంబర్‌ రాస్తారు. వాహనం పలానా పోలీసు స్టేషన్‌లో ఉందని, దానికి కావలసిన ఫైన్‌ మీసేవలో చెల్లించి తీసుకెళ్లాలని సూచిస్తారు. నగరంలో రోడ్లపై పద్ధతి లేకుండా వాహనాలు పార్కింగ్‌ చేసిన వారికి అన్ని కలుపుకుని రూ. 500 నుంచి రూ. 2 వేల వరకు ఫైన్‌లు విధిస్తున్నట్టు పోలీసు సిబ్బంది తెలిపారు. ఐతే రాంగ్‌ పార్కింగ్‌ చేసిన ద్విచక్రవాహనానికి రూ. 300, కార్లకు రూ. 1000, ఆటోలకు రూ. 700 ఇంకా ఇతర వాహనాలను బట్టి ఫైన్‌లు విధిస్తారు. ఇంకా వాహనాన్ని స్టేషన్‌కు తరలించిన రవాణా ఖర్చులు కూడా వాహనదారుడి నుంచి వసూలు చేస్తామని చెప్పారు. రోడ్డుపై నుంచి తరలించిన వాహనంపై సంబంధిత పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేస్తారు. రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్‌ చేయకుండా పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసులు కోరుతున్నారు…