హసన్‌పర్తి: ‘మంత్రి గారూ రోడ్లు కాదు మా ఇళ్లలోకి వచ్చి చూడండి. వరద తీవ్రత ఎలా ఉందో, అంటూ మహిళలు నిరసన తెలిపారు. వరంగల్‌ 56వ డివిజన్‌ జవహర్‌ కాలనీలోని ముంపు ప్రాంతాన్ని శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఓట్లప్పుడు వచ్చి ఆ తరువాత ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇప్పటివరకు ఇళ్లులేవు జాగా లేదని అన్నారు. దీంతో మంత్రి అసహనానికి గురయ్యారు. ఇదే­మిటంటూ కార్పొరేటర్‌ సునీల్‌ను ప్రశ్నించారు. కాగా ‘మునిగిన మా ప్రాంతాలను అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి చూస్తున్నారు పోతున్నారు కానీ సమస్య మా­త్రం పరిష్కరించడం లేదు. దీనికి మీరు ఇక్క­డి దాకా రావడం ఎందుకు?’ అంటూ ఓ మహి­ళ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ను నిలదీసింది.

ఆక్రమణలతోనే వరద ముంపు:

చెరువు శిఖాలు, నాలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడం వల్ల వరంగల్‌ నగరం వరద ముంపునకు గురవుతోందని ఎర్రబెల్లి అన్నా­రు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి నాలా­లు, చెరువు శిఖాల్లో నిర్మాణాలు చేపట్టారన్నా­రు. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మ­తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.