మోడల్ మార్కెట్ సిద్ధమైంది. వరంగల్ లక్ష్మీపురానికి సరికొత్త హంగులు తెచ్చింది. అడుగు దూరంలో ప్రారంభానికి వేచిచూస్తోంది. సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో ఉట్టిపడుతోంది. ఈ ఒక్క నిర్మాణం దశాబ్దాల కాలంగా ఇటు కూరగాయల వ్యాపారులు అటు వినియోగదారులు పడుతున్న ఇబ్బందులకు స్వస్థి పలుకనుంది. ప్రభుత్వం మోడల్ మార్కెట్‌కు పునాది వేసి సమస్యలను పారద్రోలింది.

Advertisement

వ్యాపార అవసరాలకు తగినట్లుగా నిర్మాణం, విద్యుత్ సౌకర్యాలు, విశాలమైన స్థలం ఇలా ఎన్నో ఈ మోడల్ మార్కెట్‌లో కొలువుదీరాయి. త్వరలో మార్కెటింగ్‌శాఖ అధికారులు కాంట్రాక్టర్ నుంచి మార్కెట్‌ను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కొత్తగా నిర్మించిన మోడల్ కూరగాయల మార్కెట్‌లో 91షాపులతో పాటుగా సుమారు 101 ప్లాట్ ఫాంలను నిర్మించారు.

దీంతో పాటుగా మార్కెట్ అవరణలోనే రైతులు తీసుకువచ్చిన కూరగాయలను వేలం వేయడానికి తూకం వేయడానికి అనువుగా స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు ఇరుగ్గా ఉన్న కూరగాయల మార్కెట్‌లో వ్యాపారాలు నిర్వహించడానికి ఇబ్బందులుపడిన వ్యాపారులు విశాలమైన ఆవరణలో వ్యాపారాన్ని నిర్వహించుకోనున్నారు.