వరంగల్ : ప్రణయ్ హత్యకేసు నిందితుల విడుదల నిలిచిపోయింది. జైలు అధికారులకు ఇంకా బెయిల్ పేపర్లు అందకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులైన మారుతీరావు, శ్రవణ్ కుమార్, కరీంపై పీడీయాక్టు నమోదు చేశారు. అయితే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. శనివారం వరంగల్ సెంట్రల్ జైలు నుంచి విడుదల కావాల్సిన నిందితులు సాంకేతిక కారణాల రీత్యా ఆదివారం విడుదల కానున్నారు.

మిర్యాలగూడలో ప్రణయ్ పరువుహత్య ఘటన ఇరు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందనే ఆవేశంతో ప్రణయ్ ను ఆమె తండ్రి మారుతీరావు హత్య చేయించాడు. ఈ నేపథ్యంలో వరంగల్ సెంట్రలో జైల్లో ఉన్న మారుతీరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన తండ్రికి లభించిన బెయిల్ పై అమృత ఆవేదన వ్యక్తం చేసింది. నడిరోడ్డుపై పట్టపగలు హత్య చేయించిన వ్యక్తికి బెయిల్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది. తన తండ్రి బయటకు రావడంతో, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తమకు సెక్యూరిటీని పెంచాలని జిల్లా ఎస్పీని కోరింది. బెయిల్ పై హైకోర్టులో అప్పీల్ చేస్తామని.అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.