కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌లో ఘటన ప్రయాణికుడి నుంచి ఫోన్ కాజేసిన యువకుడు, తప్పించుకునే ప్రయత్నంలో రైలు నుంచి దూకిన నిందితుడు రైలు ప్రయాణికుడి నుంచి సెల్‌ఫోన్ కాజేయబోయిన ఓ యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడినా రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. వరంగల్ జిల్లా కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిందీ ఘటన. రైల్వే పోలీసుల కథనం ప్రకారం:

ఆదివారం తెల్లవారుజామున 3:50 గంటల సమయంలో వరంగల్ వైపు వెళ్తున్న రైలులోని ప్రయాణికుడి నుంచి ఎస్‌కే నసీర్ (20) అనే యువకుడు సెల్‌ఫోన్ కాజేశాడు. గమనించిన బాధిత ప్రయాణికుడు కేకలు వేశాడు. దీంతో ఎక్కడ పట్టుబడతామో అన్న భయంతో నసీర్ రైలు నుంచి కిందికి దూకేశాడు.

ఈ క్రమంలో అదుపుతప్పి రైలు కింద పడడంతో రెండు కాళ్లు తెగిపడ్డాయి. చిమ్మ చీకటిలో, ఎముకలు కొరికే చలిలో బాధను అదిమిపెట్టుకుంటూ సమీపంలోని పొద వద్దకు చేరుకుని చోరీ చేసిన ఫోన్ నుంచే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. దాదాపు గంట తర్వాత ఆ ప్రాంతానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది చీకట్లో నసీర్ ఎక్కడున్నాడో తెలియక మరో గంట సేపు వెతికారు. చివరికి పట్టాలపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా పొదల వద్దకు వెళ్లి అపస్మారక స్థితిలో పడి ఉన్న నసీర్‌ను గుర్తించి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.