ఇంకాసేపట్లో వివాహం జరగనుండగా పెళ్లికూతురు ఈ పెళ్లి వద్దంటే వద్దంటూ తెగేసి చెప్పేసింది. అయితే పెళ్లి వద్దనడానికి ఆమె చెప్పిన కారణం వింటే ఆశ్చర్యపోక తప్పదు మరి. ఇంతకు ఆమె చెప్పిందంటే ఆ వరుడికి లెక్కలు సరిగా రావని వివాహాన్ని రద్దు చేసింది. వివరాల్లోకెళ్తే: గీతా సింగ్‌ అనే యువతికి, భరత్‌ అనే యువకుడికి వివాహం నిశ్చయమైంది. మంచి ఘనంగా వివాహ తంతు సాగుతోంది. బంధుమిత్రులందరూ వారి వివాహాన్ని తిలకించి ఆశీర్వచనాలు అందించేందుకు వచ్చారు. కాసేపట్లో పెళ్లి జరగనుండగా ఆమె ఈ విషయం చెప్పి అక్కడి వారిని షాక్‌కు గురిచేసింది. ఆమెకు కుటుంబ సభ్యులు నచ్చజెప్పాలని చూసినా ససేమిరా అనేసింది.

ఈ నేపథ్యంలో అమ్మాయి తరుఫు కుటుంబ సభ్యులు వరుడు వద్దకు వచ్చి పది రూపాయాల కరెన్సీ నోట్లు మూడు ఇచ్చి లెక్కించమన్నారు. పాపం ఆ వరుడు ఆ చిన్న​ పరీక్షలో నెగ్గలేకపోయాడు. అతను కరెన్సీ లెక్కించడంలో విఫలమవ్వడంతో అక్కడ ఉన్నవారందూ ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డారు. ఆ యువతి మాత్రం నాకు అతను వద్దంటే వద్దని బీష్మించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది ఆఖరికి పోలీసులు సైతం జోక్యం చేసుకుని ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్‌ ఇచ్చి సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినా పెళ్లికూతురు ససేమిరా అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసింది. దీంతో చేసేది లేక వరుడు, అతడి కుటుంబ సభ్యులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.