దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోయారని సామాజిక మాధ్యమాల్లోనో, పత్రికల్లోనో చదివినప్పుడు, అయ్యో పాపం అంటూ అంతా బాధపడతారు. కానీ, ఈ కేటుగాళ్లు మాత్రం బ్యాంకులను బురిడీ కొట్టించి ఆ వ్యక్తి పేరు మీద రుణం తీసుకుంటారు. గతేడాది మరణించిన నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల పేర్ల మీద వివిధ జాతీయ, ప్రైవేటు బ్యాంకుల నుంచి ఇలా రూ.54 లక్షలు కొల్లగొట్టారు. ఈ వ్యవహారం వెనుక గుంటూరు జిల్లా గొట్టిపాడుకు చెందిన నిమ్మగడ్డ ఫణిచౌదరి(33), పెద్దవల్లి శ్రీనివాసరావు(33), కొమ్మూరుకు చెందిన మండవ స్వరూప్‌నాథ్‌ చౌదరి(34), బీకేపాలేనికి చెందిన కాండ్రూ హరీష్‌(25), బుడంపాడు వాసి నార్నే వేణుగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణారెడ్డి(35), వెళ్లలూరుకు చెందిన వీర శేఖరరావు(28) ఉన్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగుల ఫోన్‌ నంబర్లు, ఇతర వివరాలను నిందితులు సామాజిక మాధ్యమాలు, పత్రికల ద్వారా సేకరించారు. వారి ఫొటోలను సేకరించి నకిలీ ఓటర్‌ ఐడీ, పాన్‌ కార్డులను తయారు చేశారు. టెలికం సంస్థలను ఆశ్రయించి మరణించిన వ్యక్తులు వినియోగించిన సిమ్‌ కార్డులను పొందారు. అత్యవసరంగా డబ్బులు జమ చేయాలి.. ఖాతా వివరాలను మరిచిపోయాం.. అంటూ బ్యాంకు అధికారులను సంప్రదించి ఆ సమాచారాన్ని సేకరించారు.

నెట్‌ బ్యాంకింగ్‌లో ఫోన్‌ నంబర్‌, ఖాతా వివరాల సాయంతో యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, మెయిల్‌ ఐడీ, ఇతర వివరాలను మార్చి లాగిన్‌ అయ్యారు. క్రెడిట్‌ కార్డులపై ఉన్న ప్రీ అప్రూవ్డ్‌(ఇన్‌స్టాంట్‌) లోన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రుణం ఖాతాలో జమ కాగానే నకిలీ ధ్రువీకరణ పత్రాలతో తెరిచి మరో ఖాతాకు డబ్బులను బదిలీ చేసి విత్‌డ్రా చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేశారు. బాధితుల పేరుపై కొత్తగా క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను తీసుకున్నారు.