సెంట్రల్‌ యూనివర్శిటీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హిందీ సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ చేస్తున్న దీపికా మహాపాత్రో (29) బాత్రూమ్‌లో జారిపడి చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా గత కొంతకాలంగా ఆమె న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం బాత్రూమ్‌కు వెళ్లిన దీపికా ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచర విద్యార్థినులు వెళ్లిచూడగా అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో పడిఉండటాన్ని గమనించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే దీపిక మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.