పెళ్లికి నిరాకరించినందుకు విద్యార్థిని ఒంటిపై పెట్రోల్‌ పోసి హతమార్చిన పెండ్యాల సాయి అన్వేశ్‌పై పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేస్తూ వరంగల్‌ పోలీసు కమిషనర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం హన్మకొండ సీఐ సంపత్‌రావు జైలు అధికారులను కలిసి సాయి అన్వేశ్‌కు పీడీ యాక్ట్‌ పత్రాలను అందించారు. సంగెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన తోపుచర్ల రవళి హన్మకొండలో హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ చదివింది. ఈ క్రమంలో వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన పెండ్యాల సాయి అన్వేశ్‌ తనను వివాహం చేసుకోవాలని రవళిని తరుచూ వేధించేవాడు. దీనికి రవళి నిరాకరించడంతో ఫిబ్రవరి 27న హన్మకొండ కిషన్‌పురలో రవళి ఉంటున్న హాస్టల్‌ వద్ద ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆమెను హైదరాబాద్‌కు తరలించి చికిత్స చేయించగా మార్చి 4న మృతి చెందింది. అప్పటి నుంచి కేసు విచారణలో ఉండగా నిందితుడిపై తాజాగా పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.