వింగ్ కమాండర్ అభినందన్‌ను భారత్‌కు అప్పగించే ముందు పాకిస్తానీ అధికారులు ఆయన చేత మాట్లాడించి ఓ వీడియోను రికార్డ్ చేశారనీ, ఈ కారణంగానే అభినందన్‌ను భారత్‌కు పంపే విషయంలో జాప్యం చోటు చేసుకుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఆయన చేత బలవంతంగా మాట్లాడించి ఈ వీడియో రికార్డ్ చేశారా అన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. వీడియోను అనేక చోట్ల భారీగా ఎడిట్ చేసిన అనంతరం పాకిస్తానీ మీడియాకు అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. అభినందన్ కొంత పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేసినట్లుగా ఆ వీడియోలో ఉంది.
వర్ధమాన్ ఆ వీడియోలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ‘నేను ఒక లక్ష్యాన్ని (దాడి చేసేందుకు) వెతుకుతుండగా పాకిస్తాన్ వైమానిక దళం నా విమానంపై దాడి చేసింది. దాంతో విమానం దెబ్బతినగా, నేను ప్యారాచూట్ సాయంతో కిందకు దూకాను. ఆ సమయంలో నా దగ్గర తుపాకీ ఉంది. అక్కడ చాలా మంది జనం ఉన్నారు. నన్ను నేను కాపాడుకోవడానికి ఒకే దారి ఉంది. తుపాకీని పడేసి పరుగెత్తేందుకు ప్రయత్నించాను. ప్రజలు నన్ను వెంబడించారు. వారు అప్పుడు తీవ్ర ఆవేశంతో ఉన్నారు. అప్పుడే ఇద్దరు పాకిస్తానీ ఆర్మీ అధికారులు నన్ను వారి నుంచి రక్షించారు. వాళ్ల యూనిట్‌కు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం ఆసుపత్రిలో చేర్పించారు. పాకిస్తాన్ ఆర్మీ వృత్తి పట్ల చాలా నిబద్ధత కలిగినది. అది నన్ను ఆకట్టుకుంది’ అని అభినందన్ ఆ వీడియోలో అన్నారు.