భారత్ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ విమానాలను తరుముకుంటూ చావు బ్రతుకుల మధ్య పాక్ సైన్యానికి చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన విడుదలకు అధికార ప్రక్రియ ప్రారంభించారు. ఈ మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య వాఘా సరిహద్దు వద్ద భారత్ అధికారులకు అభినందన్ ను అప్పగించనున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే బోర్డర్ వద్దకు వేలాదిగా చేరుకొని స్వాగతం పలకనున్నారు. జైహింద్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతోంది. సైనిక దళాల బృందం అభినందన్ కు స్వాగతమ్ పలకనుంది. ఈ నేపథ్యంలో తమ కన్న బిడ్డను చూసేందుకు అభినందన్‌ తల్లిదండ్రులు విశ్రాంత ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌ వర్ధమాన్‌, శోభా వర్ధమాన్‌ సైతం చెన్నై నుంచి దిల్లీకి గురువారం రాత్రి విమానంలో చేరుకున్నారు.

ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి అమృతసర్ కు వారు బయలుదేరి వెళ్లారు. భారత్ పై దాడికి వచ్చిన f 16 యుద్ధ విమానాలను తన మిగ్ 21 తో తరిమి.. ఒక విమానాన్ని కూల్చివేసి.. మిగిలిన విమానాలపై దాడికి వెళ్తుండగా పాకిస్తాన్ సైన్యం జరిపిన క్షిపణి దాడిలో అభినందన్ విమానం కూలి పాక్ సైనయానికి చిక్కిపోయాడు. విమానం కూలిపోయినా శత్రువులతో పోరాడుతూ తన వద్ద వున్న వివరాలను నీటిలో వేసి.. నాశనం చేసి.. శత్రువులకు దొరికిపోయాడు. అభినందన్ ను పాక్ సైన్యం అక్కడి మన రాయబార కార్యాలయానికి గానీ.. రెడ్ క్రాస్ సంస్థకు గానీ అప్పగిస్తారు. అక్కడి నుంచి అభినందన్ ను వాఘా బోర్డర్ వద్దకు తీసుకొస్తారు. వాఘా బోర్డర్ వద్ద వాతావరణం సందిగా మారింది. జాతీయ జెండాలు చేతబట్టుకుని చుట్టుపక్కల గ్రామాలనుంచి అద్భుతమైన.. అరుదైన ఈ సన్నివేశాన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.