74 సంవత్సరాల మంగాయమ్మ అనే వృద్ధురాలికి ఐవీఎఫ్ విధానంలో కవల పిల్లలు పుట్టేలా చేసిన వైద్యులపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగుతున్న వేళ, ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ (ఐఎఫ్ఎస్) క్షమాపణ చెప్పింది. భవిష్యత్తులో ఇలా జరుగకుండా చూస్తామని, ఇండియన్ సొసైటీ ఆఫ్ రీ ప్రొడక్షన్, అకాడెమీ ఆఫ్ క్లినికల్ ఎంబ్రాలజిస్ట్స్ , ఐఎఫ్ఎస్ ఓ ప్రకటనలో క్షమాపణలు తెలిపాయి. ఇది పూర్తిగా అనైతిక చర్యని, నిబంధనలను దుర్వినియోగపరిచారని, అంత పెద్ద వయసులో గర్భం దాల్చడం వల్ల అనర్థాలే అధికమని వెల్లడించాయి. ఏ విధానంలో అయినా 50 సంవత్సరాలు దాటితే, మహిళ గర్భం నుంచి పిల్లల్ని పుట్టించడం సరైన విధానం కాదని, ఈ వయసులో మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులకు అవకాశం అధికమని తెలిపిన ఐఎఫ్ఎస్, ఐవీఎఫ్, సరోగసీ విధానాల్లో చట్టాలు సరిగ్గాలేనందునే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది.