- ములుగుకు కొత్త శోభ.
- శరవేగంగా 163 హైవే పనులు.
- అటు జిల్లా – ఇటు యూనివర్సిటీ.
- పర్యాటక ప్రాంతాలతో నెంబర్ వన్ గా మారనున్న సమ్మక్క – సారలమ్మ
ఏజెన్సీ ప్రాంతమైన ములుగు కొత్త శోభ సంతరించుకోనున్నది . ప్రజలు ఎపుడెప్పుడా అని ఎదురు చూసిన ములుగు సమ్మక్క – సారలమ్మ జిల్లా కార్యాలయాం ఏర్పాటు అయింది. ఎన్నో ఏళ్లుగా అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్న ములుగు కాస్త ఆలస్యంగానైనా వెలుగుల ప్రపంచంలోకి అడుగిడుతోంది . అభివృద్ధి వైపు నడవడంతో పాటు పర్యాటక ప్రాంతాలకు నెలవవబోతోంది .
శరవేగంగా 163 హైవే పనులు
ములుగు 163 జాతీయ రహదారికిరువైపులా లైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి . ములుగు మండల పరిధి మేడివాగు నుండి గోవిందరావుపేట పస్రా వరకు జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారి పనులు జరిగితే రామప్ప , లక్నవరం, మేడారం, మల్లురు, దేవసానంతో పాటు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికి, ప్రయాణం మరింత సుగమమవుతోంది . అంతేకాక ప్రతి రెండేళ్లకొకసారి జరిగే మేడారం జాతరకు వాహనాలు వెళ్లడానికి రవాణా సులువవనున్నది .
అటు జిల్లా – ఇటు యూనివర్సిటీ
తెలంగాణ రాష్ట్రంలో రెండు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయగా అందులో ములుగు జిల్లాను ప్రభుత్వం ప్రకటించింది . దీంతో ములుగు సమ్మక్క – సారలమ్మ జిల్లాగా రూపాంతరం చెందినది . ములుగు జిల్లా ఏర్పాటు కావడంతో ములుగు నియోజకవర్గంలోని ప్రజలకు సౌకర్యాలు చాలా వరకు మెరగవనున్నది . అంతేకాక విద్యార్థులు చదువుకోడానికి కళాశాలలు ఏర్పాటు అవుతాయి . దీంతో పాటు అనేక రకాలుగా నియోజకవర్గ ప్రజలకు సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి . జిల్లా ఏర్పాటే కాకుండా ములుగు గట్టమ్మ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కానుండటంతో ములుగు విద్యాలయంగా కూడా మారనున్నది .
పర్యాటక ప్రాంతాలతో నెంబర్ వన్
ములుగు నియోజక వర్గానికి ఇప్పటికే పర్యాటక ప్రాంతాల నెలవుగా మంచి గుర్తింపు ఉన్నది . ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన రామప్ప ఆలయం , ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క – సారక్క జాతరతోపాటు మంగపేటలోని మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం , ములుగు మండలం లోని కొత్తూరు గుట్టపై వెలసిన పురాతన బౌద్దాలయం , మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ దేవాలయంతో, ములుగు జిల్లా ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది . మరో పక్క లక్నవరం , రామప్ప సరస్సు , బొగత జలపాతంతోపాటు గోదావరిపై నిర్మించిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ , గిరిజనులకు ఉద్యోగ ఉపాధి కల్పించే ఐటీడీఏ ఇంక ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి.. ఇంతకు ముందు ఈ పర్యాటక ప్రాంతాలు జయశంకర్ జిల్లాలో ఉండగా ప్రస్తుతం ములుగు జిల్లా ఏర్పాటుతో సమ్మక్క – సారలమ్మ పేరుతో విరజిల్లనున్నాయి . పర్యాటక ప్రాంతాలతో ములుగు సమ్మక్క – సారలమ్మ నెంబర్ వన్ గా మారనున్నది .