స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొత్త మెలిక పెట్టారు. వేతనాలు ఇస్తేనే ఓటు వేస్తామని అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థులకు స్పష్టం చేస్తున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉండే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 24 నెలలుగా గౌరవ వేతనాలు అందడంలేదు. పదవీకాలం పూర్తవుతున్న తరుణంలో ఇప్పుడైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ ఈ నెల 31న జరగనుంది. ఎంపీటీసీలు, జెడ్పీ టీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నారు. ఓటర్లను ప్రసన్నం చేసు కునేందుకు మూడు జిల్లాల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులు క్యాంపులు నిర్వహిస్తున్నారు. రెండురోజుల క్రితం వరకు హైదరాబాద్‌లోనే ఉన్న క్యాంపులు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. న్యూఢిల్లీ, సిమ్లా, బెంగళూరు, కేరళలో అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు క్యాంపులు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ క్యాంపులు నడుస్తున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఒక క్యాంపుగా ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు ముందే ఓటర్లకు ఏదో రకంగా సాయం చేయడం సహజంగా జరుగుతోంది. ఈసారి మాత్రం క్యాంపులకు వెళ్లే ముందే ఓటర్లను అభ్యర్థులు ప్రసన్నం చేసుకున్నట్లు తెలుస్తోంది.