ఎంజీఎం ఆస్పత్రికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృషి చేస్తున్నారు . ఉత్తర తెలంగాణాతో పాటు మహారాష్ట్ర , చత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల నుంచి వైద్య సేవల కోసం పేదలు ఎంజీఎం ఆస్పత్రికి వస్తుంటారు . అయితే గత కొంతకాలంగా ఆస్పత్రిలో వైద్యుల కొరతతో పాటు , రోగులకు అవసరమైన వైద్య పరీక్షలకు సదుపాయల కోసం జరుగుతున్న ప్రయత్నాలకు తోడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక దృష్టి సారించారని జరుగుతున్న పరిణామాలు స్పష్టమవుతున్నాయి . గతంలో ప్రభుత్వ విప్గా ఉన్న కాలంలో ఆస్పత్రిపై ప్రత్యేక శ్రద్దపెట్టి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి , ఆస్పత్రిలో శానిటేషన్ రోగులు బంధువులకు భోజన వసతి కల్పించడంతో అన్ని రకాల ఆపరేషన్లకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని మంత్రి పదవి చేపట్టిన తరువాత ప్రత్యేకంగా మంత్రి ఎర్రబెల్లి ఎంజీఎం దవాఖానపై ప్రత్యేక నజర్ వేశారు .

ఎంజీఎం ఆస్పత్రిలో గత కొన్ని నెలలుగా సీటీస్కాన్ , ఎంఆర్ఐ వంటి పరీక్షలపై అనిశ్చిత పరిస్థితి నెలకొన్నది . పేదలకు ప్రభుత్వ ఆస్పత్రులోనే మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా మంత్రి అడుగువేశారు . పేదరోగులకు అందించడానికి కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలను కొనుగోలు చేసినా , వాటి నిర్వహణ సరిగా లేక ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని గుర్తించారు . ప్రాథమికంగా ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి దయాకర్ రావు గత నెల 28న జిల్లాలో పర్యటించారు . ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు సరియైన వైద్యం విషయంలో కొన్ని సమస్యలున్నాయి . సాంకేతిక అంశాలతో , నిధుల సమకూర్చడం , మెరుగైన వైద్య పరీక్షల లభ్యత ఆస్పత్రి ఆవరణలోనే ఉండాలని భావించిన కొంతమంది మంత్రి దృష్టికి తెచ్చారు . దీంతో మంత్రి ఆస్పత్రి అధికారులను పిలిపించి వివరాలను సేకరించారు .

ఆ వివరాల ఆధారంగా ఎంజీఎం ఆస్పత్రిలో పేదల కోసం నెలకొల్పిన ఖరీదైన వైద్య పరికరాల మరమ్మతు , వాటి నిర్వహణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ ను కోరారు . స్పందించిన మంత్రి తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు .